Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

దివ్యాంగులు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలపై కౌన్సిలింగ్ - పార్ట్ 1

 Adopt to Thrive వెబ్సైటులో ఇవ్వబడిన ఈ - మెయిల్ కు దివ్యాంగులలో కొందరు అనుదిన జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సిలింగ్ నిమిత్తం నాకు వ్యక్తిగతంగా మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ వెబ్సైటు ద్వారా వారికీ నేను అందించే సమాధానాలు వారికి ఉపయోగకరముగా ఉన్నవని వారు చెప్తుంటారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న అనేకమంది దివ్యాంగుల ప్రయోజనార్ధమై వాటిలో ముఖ్యమైనవి క్రింద పోస్ట్ చేయబడెను.

ప్రశ్న: నమస్తే మేడమ్, మాది కృష్ణా జిల్లా. నా ఫ్రెండ్ ఒకరి ద్వారా మీ వెబ్‌సైట్ గురించి చెప్పినప్పుడు అది చూసి నా సమస్యను మీకు చెప్పుకుందాము అనుకొని మెయిల్ పెడుతున్నాను. నా వయసు 36. నాకు ఒక కాలు పోలియో. నేను డిగ్రీ వరకు చదివి ప్రైవేటుగా ఒక చిన్న జాబ్ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను. మా అమ్మా నాన్నలకు మేము ఇద్దరు పిల్లలము. నేను పెద్ద అమ్మాయిని. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడికి పెళ్లి అయింది. మా అమ్మానాన్నలకు నేను అంటే చాలా ప్రేమ. మా తమ్ముడు కూడా పెళ్లికి ముందు వరకు నాతో ప్రేమగా ఉండేవాడు. కానీ పెళ్లి తర్వాత చాలా మార్పు వాడిలో చూశాను. నా తల్లిదండ్రులు ఉన్నంత వరకు నా మంచి చెడు చూస్తారు. వాళ్ళు లేకపోతే నన్ను పట్టించుకునే వారు ఉండరు అనే భయం రోజు రోజుకు పెరిగిపోతుంది మేడమ్. నాకు చాలా సంబంధాలు చూశారు కానీ నా శారీరక లోపం వల్ల ఎవరూ ముందుకి రావట్లేదు. వయసు కూడా అయిపోతుంది ఇంకా నీకు పెళ్లి అవసరమా అని ప్రశ్నించే వారే కానీ తను కూడా ఒక మనిషే అని ఆలోచించే వారు లేరు కదా మేడమ్. అందుకే ఒక్కోసారి ఒంటరిగా చచ్చిపోయే కంటే అమ్మానాన్న ఉండగా చచ్చిపోవటమే అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకుని నేను నా భర్తకు ఒక భార్యగా చేయాల్సినవి చేయలేను కదా కాబట్టి పెళ్లి చేసుకుని మరొక మనిషి జీవితం కష్టపెట్టడం ఎందుకులే అని పెళ్లి కూడా వద్దులే అనిపిస్తూ నిర్జీవంగా కాలంను వెళ్ళబుచ్చుతున్నాను. నిజంగా పెళ్లి చేసుకున్నా కూడా నేను అందరిలా చక్కబెట్టలేను. అంత ఆస్తి ఉన్న నాకుంటూ ఒక తోడు లేదే అని ఏడుపు వస్తుంది. ఎందుకు ఇలా పుట్టాను? అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది మేడమ్. చాలా మంది నువ్వు పెళ్లికి పనికి రావు అంటుంటారు. సాధారణ స్త్రీగా దేవుడు అన్నీ ఇచ్చాడు ఒక్క శారీరక లోపం తప్ప. నాలో సంతోషం కొంచెము కూడా లేదు మేడమ్. భావోద్వేగాల కోసం మీరు రాసిన ఆర్టికల్ చూసి నా బాధ మీతో పంచుకోవాలనిపించి మీకు మెయిల్ చేశాను.

మీరు కూడా నాకు లాగా శారీరక లోపం ఉన్నవారే అని తెలిసింది. పెళ్లిపై మీ ఉద్దేశ్యం ఏమిటి మేడమ్? అన్నీ బాగున్నవారితోనే సంతోషంగా ఉంటారా మనతో ఉండలేరా మేడమ్?
జవాబు: మీ సమస్యలను ఒక్కొకటిగా ప్రాక్టికల్గా విశ్లేషించాలని కోరుతున్నాను. 

1. భయంతో మీ మీద మీకు నమ్మకం లేకపోవటం
2. ఒంటరిని అనే బాధ
3. ఎవరు సాయం చేయరేమో
4. మనుష్యులు మాట్లాడే మాటలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి.
5. తమ్ముడు మారిపోయారు అనే తలంపు
6. పెళ్లి

ఇవన్ని సమస్యలు అని మీరు అనుకుంటున్నారు. కానీ అవి మనం జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడడానికి దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితులు లేదా సాధనాలు. 

మొదటిగా ఏమి జరుగుతుందో, నేను ఏమి అయిపోతానో, అన్న భయం వీడండి. భయం అనేది మనలాంటి వారి జీవితంలో అసలు ఉండకూడదు. జీవితంలో ఎప్పుడూ ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు. మనలాంటి వారికి మాత్రమే కాదు నీలిమ గారు అన్నీ ఊహించి ఏదేదో ఆలోచిస్తే ప్రతీ ఒక్కరి జీవితం భయానకంగానే ఉంటుంది. 

ఈ లోకంలో పలు రకాల భయాలు ఉంటాయి కానీ అవి మనల్ని ప్రభావితం చేసేలా వాటిని మన జీవితంలోకి అనుమతించకూడదు. ఉదాహరణకు నేను హాస్టల్ లో జాయిన్ అయిన కొత్తలో అక్కడ ఉండాలి అంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే అప్పటివరకు నా కుటుంబ సభ్యులు నన్ను ఏ లోటూ రాకుండా అన్ని చేసిపెడుతూ చూసుకునేవారు. కానీ హాస్టల్ కి వెళ్ళాక అవన్నీ నేనే చేసుకోవాలి అది నాకు ఒక యుద్దంలా ఉండేది కానీ ఆవేదన పడుతూ ఉంటే నేను చదువు విజయవంతంగా పూర్తి చేయలేనని తెగించి నా పనులు నేను చేసుకొనేలా అలవాటు పడ్డాను. సాయత్రం కాలేజీ నుండి వచ్చి కాలిపేర్స్ తీసిన తరువాత నా కాళ్ళు చూసుకుంటే వాచిపోయి పుండ్లు పడి విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితి నాది. ఆ భయంతో ఇంటికి వెళ్లిపోవాలి అనిపించేది. కానీ నా తల్లిదండ్రులు చెప్పే మాటలు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వగా నాలో ధైర్యం పుంజుకొని 13 ఆపరేషన్స్ కంటే ఇది ఒక సమస్య కాదులే నేను ఎదిరించగలను ఆ నమ్మకం నాకు ఉంది అని నాకు నేను ధైర్యం చెప్పుకొని ముందుకు కొనసాగి చదువు పూర్తి చేశాను. కాబట్టి ఇకనైనా మీ భయాన్ని వీడి నేను కూడా ఏదైనా చేయగలను. ఎలాంటి పరిస్థితులను అయిన ఎదుర్కొనగలను అని మొదట మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరచుకొని ముందుకు కొనసాగండి. అప్పుడు విజయం మీ వెనకే ఉంటుంది. 

ఇక రెండవది ఒంటరిని అనే బాధ లేదా ఒంటరినీ అవుతనేమో అనే బాధ. అసలు మీరు ఒంటరి ఎలా అయ్యారు? మిమ్మల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకునే మంచి పేరెంట్స్ ఉన్నారు కదా. మీరున్న చీకటి ప్రపంచం నుండి బయటకి రావాలి. అప్పుడు లోకంలో పరిస్థితులు మీకు తెలుస్తాయి. మీకు ఉండడానికి ఇల్లు ఉంది, జీవించడానికి ఉద్యోగము ఉంది, అంతకంటే విలువైన కుటుంబం ఒకటి ఉంది. బయట అనాథలుగా, నిరాశ్రయులుగా ఉన్నవారు అనేకమంది ఉంటారు. మరి వారు ఏమై పోవాలి? 

రేపు ఏదో జరుగుతుంది అని ఊహించుకొని భయపడేకన్న ప్రస్తుతంలో జీవించడం అలవాటు చేసుకోండి. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఈ భూమి మీద ఏది, ఎవరూ శాశ్వతం కాదు. ఎవరైనా లోకాన్ని విడచి వెళ్ళవలసిన వారే. మన దగ్గర లేని వాటి కోసం బాధపడకుండా ఉన్నవాటి కోసం సంతోషించి వాటి ద్వారా మనం ఏం సాధించగలమో గ్రహిస్తే మీ లక్ష్యం వైపు అడుగు వేస్తే ఇప్పుడు ఒంటరిని అనుకుంటున్న మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలిగితే లోకమే మిమ్మల్ని వెంబడిస్తది. అప్పుడు ఒంటరి వారు ఎలా అవుతారు.

ఇక మూడవది, ఎవరు సహయం చేయరేమో అన్న భయం. అసలు ఎవరో ఎందుకు మనకు సహయం చేస్తారు? వారికి ఏమి అవసరం? మన కుటుంబం మన మీద ప్రేమతో మనకి సహయం చేస్తుంది. కానీ బయట వారికి అవసరం లేదు కదా? మీకు ఒక కాలు మాత్రమే పోలియో అని చెప్పారు. దానిని బట్టి మీరు నాకంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి నీలిమ గారు. నా పరిస్థితిని వివరించాను కదా అలాంటి పరిస్థితిలో ఉన్న నేనే ఎవరి సహయం ఆశించకుండా చేస్కోగలుగుతున్నపుడు మీరు చేసుకోలేరా? సహయం అడగటంలో తప్పులేదు కాని చేస్తారని ఎదురుచూసి ఆగిపోవడం ముమ్మాటికీ తప్పే. ఎందుకంటే కొందరికి సహయం చేయడానికి కుదురుతుంది, కొందరికి కుదరకపోవచ్చు. కాబట్టి ఇండిపెండెంట్ గా బ్రతకడం నేర్చుకొనగలిగితే మీరు ఒకరి సహయం కోసం ఎదురు చూడనవసరం లేదు. 

ఇక నాల్గవది, మనుష్యులు మాట్లాడే మాటలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఆ మాటలు తప్పు అని నిరూపించే పరిస్థితి మీ దగ్గర ఉందేమో గ్రహించి మిమ్మల్ని మీరు నిరూపించుకోగలిగితే అలాంటి మాటలే మీకు వినబడిని స్థితిలోకి మీరు వస్తారు. 

ఇక ఐదవది, తమ్ముడు మారిపోయారు అనే తలంపు.  పెళ్లికి ముందు వరకు తమ్ముడికి ఉద్యోగము, మీ కుటుంబమే బాధ్యత. అయితే పెళ్లి తరువాత తమ్ముడి జీవితంలో మరొక కొత్త వ్యక్తి రావడం ఇంకొంచెం బాధ్యత పెరగటం జరింగింది. ఆమెకు మీ కుటుంబంలో తమ్ముడే మొదటి ప్రపంచం. పెళ్లయిన కొత్తలో అతనితో మాత్రమే ఏదైనా షేర్ చేసుకోగలరు కదా. మరి ఆమె అభద్రతాభావం నుండి బయట పడడానికి మీ తమ్ముడు ఒక భార్యకు భర్తగా తాను చేయవలసినది చేయాలిగా. 

ఇది కొంచెం బాధ కలిగించిన వాస్తవంగా మాట్లాడితే మన ఆడవారిలో ఉన్న సహజ గుణం కొత్తవారు కుటుంబంగా చేరితే వారి మూలంగా మన స్థానం కొల్పోతామేమో అన్న భయం. భయంతో కూడిన స్వార్థం. ఇది జయిస్తే అంతా మంచిగానే కనపడుతుంది. తమ్ముడు మిమ్మల్ని ఇదివరకటిలా చూస్తాడా? చూడలేదు అని కాకుండా మీరు తమ్ముడికి కొంచెం స్పేస్ ఇచ్చినట్లయితే మీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుందని గ్రహించగలిగి తమ్ముడితో పాటు మీరు కూడా మరదలిపై ప్రేమ చూపి ఒక మంచి హెల్తీ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయగలిగితే పేరెంట్స్ తరవాత పేరెంట్స్ వారే అవుతారు. మీ పలువిధ ఆలోచనల్లో నుండి బయటకి వచ్చి వాస్తవాలను గ్రహించగలిగితే మీరు అందరితో సంతోషంగా ఉండగలుగుతారు.  

ఇక చివరిగా పెళ్లి. నా వరకు పెళ్లి అనేది జీవితంలో ఒక చాప్టర్ అనే అనుకుంటాను. పెళ్లే జీవితం కాదు. అన్ని బాగున్న వారు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారని గ్యారెంటీ ఉందా? లేదు కదా! ఒకవేళ నిజంగా మీకు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశ్యం ఉంటే మీరు డిగ్రీ చదివారు కాబట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించి సాధించినట్లయితే మీ విజయాన్ని బట్టి మీ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేవారు ఉంటారు. అలా ప్రయత్నించండి. 

పెళ్లి విషయంలో అన్ని బాగున్నవారితోనే సంతోషంగా ఉంటారా మనతో ఉండలేరా అని మీరు అడిగారు కదా!

ఎందుకు ఉండలేరు ఉండగలరు కాకపోతే ఒక వైకల్యం కలిగిన వ్యక్తిని ఎవరూ చూసిన మొదట వారు ఫిజికల్ గా ఆలోచిస్తారు అది కామన్. ఎవరైనా కోరుకునేది మొదట చూడగానే లోపం లేని వారిగా ఉండాలని.  దాన్ని మనం ఒప్పుకోవాలి కానీ పట్టించుకోకూడదు. 

ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడే సందర్భం ఏర్పడితే మీరు ఒక భార్యగా ఏమి చేయగలరో అది వారికి అర్థమయ్యేలా వ్యక్తపరచండి తప్పులేదు. ఏ జంట అయిన తమను అర్థం చేసుకొని, అన్ని పరిస్థితుల్లో ఒకరికొకరు కలిసి ప్రేమను పంచుకొని తోడుగా ఉండాలి అనే కోరుకుంటారు. ఆ ప్రేమను మనం పంచలేమా? అర్థం చేసుకోలేమా? 

ఒక భార్యగా మీరు ప్రేమను పంచగలరు, పరిస్థితులను అర్థం చేసుకొనగలిగిన వారు అయితే మీలో ఉన్న వైకల్యం ఒక అడ్డు బండలా ఎదుటివారికి కనిపించదు. ఇది ఆరంభంలో వారికి తెలియకపోయినా కాలం గడిచే కొద్దీ మీ ప్రవర్తన, మీ స్వభావం ద్వారా వారు అర్థం చేసుకొని మిమ్మల్ని విడువలేనంతగా ప్రేమిస్తారు. ప్రేమిస్తారు అనే మాట వినడానికి చాలా ఆనందంగా ఉంది కదా. అవును అండి మన సంతోషం మన చేతిలోనే ఉంది. 

కేవలం వికలాంగులకే కాదు ప్రతీ ఒక్కరి జీవితంలో సమస్య ఉంటుంది. కాబట్టి సమస్య వైపు కాకుండా దాని పరిష్కార మార్గం వైపు మనం దృష్టి సారిస్తే మనం కూడా అందరిలా, పోనీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండగలం.

చివరిగా ఒక మాట. మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని చేరుటకు మీ పయనం ఈ రోజే ఇప్పుడే ఈ క్షణమే ప్రారంభించి ముందుకు అడుగు వేయండి. సానుకూల దృక్పథంతో మీ జీవితాన్ని కొనసాగిస్తే అంతా మంచిగానే ఉంటుంది. ఒంటరి వారు అనే ఆలోచనే రానివ్వద్దు. చాలా ఓపికగా మీరు నా మెసేజ్ చదివి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగుతారని ఆశిస్తున్న. 

ప్రశ్న: నా వైకల్యం కారణంగా నన్ను నేను చాలా తక్కువగా భావిస్తున్నాను, నలుగురిలోకి వెళ్లాలంటే భయమేస్తుంది. దీన్ని ఎలా అధిగమించాలి?
జవాబు: మీరు అలా భావించడం సహజమే. చాలామంది దివ్యాంగులు మొదట్లో ఇలాంటి భావనలతో ఇబ్బంది పడతారు. కానీ మీరు ఒక్కరే కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి.

  1. మీ బలాలు గుర్తించండి: మీ బలమైన పాయింట్లు ఏమిటి? మీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు? వాటిపై దృష్టి పెట్టండి.
  2. చిన్న చిన్న విజయాలు సాధించండి: మీకు ఇష్టమైన పనులను మొదలుపెట్టి, వాటిలో చిన్న విజయాలు సాధించడం ద్వారా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.
  3. సానుకూల దృక్పథం ఉన్నవారితో కలవండి: మిమ్మల్ని అర్థం చేసుకునే, ప్రోత్సహించే స్నేహితులు లేదా గ్రూపులలో చేరండి.
  4. కౌన్సిలింగ్ తీసుకోండి: అవసరమైతే, ఒక నిపుణుడిని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఈ భావనలను అధిగమించవచ్చు. మీలో ఉన్న గొప్పతనాన్ని మీరు తెలుసుకునేలా కౌన్సిలర్ మీకు సహాయం చేస్తారు.

ప్రశ్న: నేను బయట జనంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు నా వైపు వింతగా చూస్తారు, ప్రవర్తిస్తారు. ఇది నాకు చాలా బాధ కలిగించి ఇబ్బందిగా ఉంటుంది. నేను వారితో ఎలా వ్యవహరించాలి?
జవాబు: దురదృష్టవశాత్తు, కొంతమందికి దివ్యాంగుల పట్ల అవగాహన ఉండదు. వారి వింత చూపులు, ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టడం సహజమే.

  1. మీ అంతట మీరు నమ్మకంతో ఉండండి: మీరు సాధారణ వ్యక్తి అన్నట్లుగా వ్యవహరించండి. మీలో ఆత్మవిశ్వాసం ఉంటే, అది ఇతరులకు కూడా తెలుస్తుంది.
  2. వివరించడానికి ప్రయత్నించండి (అవసరమైతే): కొందరు తెలియక అలా చూస్తారు. మీకు సౌకర్యంగా అనిపిస్తే, మీ పరిస్థితి గురించి సంక్షిప్తంగా వివరించవచ్చు.
  3. నవ్వుతూ ఉండండి: చిరునవ్వు అనేది ఒక అద్భుతమైన ఆయుధం. అది చాలా పరిస్థితులను సులభతరం చేస్తుంది.
  4. మిమ్మల్ని గౌరవించేవారితో ఉండండి: మీ స్నేహాన్ని లేదా సహచర్యాన్ని నిజంగా కోరుకునే వ్యక్తులపై దృష్టి పెట్టండి.

ప్రశ్న: నా శారీరక వైకల్యం వల్ల నాకు మంచి ఉద్యోగం దొరకదని భయంగా ఉంది. నా కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి?
జవాబు: మీ భయం అర్థం చేసుకోదగినదే, కానీ ఈ రోజుల్లో దివ్యాంగులకు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి.

  1. మీ సామర్థ్యాలను గుర్తించండి: మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి? వాటిని అభివృద్ధి చేసుకోండి.
  2. ప్రత్యేక విద్య మరియు శిక్షణ: మీ పరిస్థితికి తగిన ప్రత్యేక విద్య లేదా వృత్తి శిక్షణ సంస్థలను సంప్రదించండి. ప్రభుత్వం మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నాయి.
  3. సాంకేతికతను ఉపయోగించుకోండి: అనేక ఉద్యోగాలు ఇప్పుడు ఇంటి నుంచే చేసుకోవచ్చు. మీ వైకల్యానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకుని మీరు రాణించవచ్చు.
  4. దివ్యాంగుల కోసం ఉద్యోగ వెబ్‌సైట్లు: దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలు అందించే వెబ్‌సైట్లు, సంస్థలు ఉన్నాయి. వాటిని సంప్రదించండి.
  5. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోండి: మీరు మీ పనిని చేయగలరని నిరూపించడానికి సిద్ధంగా ఉండండి. మీ వైకల్యం కన్నా మీ నైపుణ్యాలే ముఖ్యమని చూపించండి.

ప్రశ్న: బస్సులు ఎక్కడం, మెట్లు ఎక్కడం వంటివి నాకు చాలా కష్టంగా ఉంది. బయటి ప్రపంచం నాకు సరిపోదు అనిపిస్తుంది. నేను ఎలా సర్దుకుపోవాలి?
జవాబు: నిజమే, మన సమాజంలో చాలా ప్రదేశాలు దివ్యాంగులకు అనుకూలంగా ఉండవు. ఇది చాలా పెద్ద సవాలు.

  1. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి: బస్సుల స్థానంలో ఆటోలు లేదా ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను పరిశీలించండి.
  2. ప్రభుత్వ సహాయం తెలుసుకోండి: ప్రభుత్వం దివ్యాంగుల కోసం అందిస్తున్న రాయితీలు, సౌకర్యాల గురించి తెలుసుకోండి (ఉదా: రవాణా, ప్రభుత్వ భవనాలలో ర్యాంపులు).
  3. హక్కుల గురించి అవగాహన: దివ్యాంగులుగా మీకు కొన్ని హక్కులు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోండి మరియు అవసరమైతే వాటిని వినియోగించుకోవడానికి వెనుకాడకండి.
  4. సహాయక పరికరాలను ఉపయోగించండి: వీల్‌చైర్లు, వాకర్స్ వంటి సహాయక పరికరాలు మీ కదలికను సులభతరం చేస్తాయి.
  5. మీ సమస్యలను తెలియజేయండి: మీరు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడం ద్వారా మార్పు తీసుకురావడానికి కృషి చేయవచ్చు.

ప్రశ్న: నా కుటుంబం నన్ను ఎక్కువగా ఆధారపడేలా చూస్తుంది. నా స్వంతంగా పనులు చేసుకోవాలని ఉన్నా, వారు నన్ను అనుమతించడం లేదు. నేను ఏం చేయాలి?
జవాబు: కుటుంబ సభ్యులు మీ పట్ల ప్రేమ, సంరక్షణతో ఉండటం సహజమే. కానీ కొన్నిసార్లు అది అతిగా ఉండవచ్చు.

  1. కుటుంబంతో మాట్లాడండి: మీ భావాలను, మీ స్వంతంగా పనులు చేసుకోవాలనే మీ కోరికను స్పష్టంగా, సున్నితంగా వారికి వివరించండి.
  2. చిన్న చిన్న పనులతో మొదలుపెట్టండి: మొదట మీరు చేయగలిగే చిన్న పనులను మీ అంతట మీరు చేయడానికి అనుమతి కోరండి.
  3. మీ సామర్థ్యాలను నిరూపించుకోండి: మీరు కొన్ని పనులను సొంతంగా చేయగలరని వారికి ఆచరణలో చూపించండి.
  4. పరిమితులు స్పష్టంగా చెప్పండి: మీరు సహాయం కోరే పరిస్థితులు ఏవి, మీ అంతట మీరు చేయగలిగేవి ఏవి అనేవి వారికి తెలియజేయండి.

ప్రశ్న: నేను దివ్యాంగుడిని అనే విషయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా ఉంది. ఇతరులతో పోల్చుకుంటూ బాధపడుతున్నాను. దీని నుండి బయటపడటం ఎలా?
జవాబు: మీ పరిస్థితిని అంగీకరించడానికి సమయం పడుతుంది అది సహజమే. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం అనేది మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.

  1. మీరు ప్రత్యేకమని గుర్తించండి: ప్రతి వ్యక్తి ప్రత్యేకమైనవారే. మీకున్న కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ, మీలో చాలా బలాలు, ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని గుర్తించండి.
  2. సానుకూల ఆలోచన: మీ గురించి మీరు సానుకూలంగా ఆలోచించడం అలవర్చుకోండి. మీ గురించి మీరు చెప్పుకునే మాటలు మీ మనస్సుపై చాలా ప్రభావం చూపుతాయి.
  3. చిన్న చిన్న ప్రణాళికలు: రోజువారీ జీవితంలో చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని సాధించినప్పుడు కలిగే సంతృప్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
  4. ప్రేరణ పొందిన వారి కథలు: దివ్యాంగులై ఉండి కూడా జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారి గురించి తెలుసుకోండి. వారి కథలు మీకు స్ఫూర్తినిస్తాయి.

ప్రశ్న: నా శారీరక వైకల్యం వల్ల ఆర్థికంగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. నాకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలంటే ఏం చేయాలి?
జవాబు: ఆర్థిక స్వాతంత్ర్యం అనేది ఆత్మవిశ్వాసానికి చాలా ముఖ్యం. దివ్యాంగులు కూడా స్వయం సమృద్ధి సాధించగలరు.

  1. ప్రభుత్వ పథకాలు: దివ్యాంగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సహాయ పథకాలు (పెన్షన్లు, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు) గురించి తెలుసుకోండి.
  2. నైపుణ్యాభివృద్ధి: మీ వైకల్యానికి అనుగుణంగా మీరు నేర్చుకోగలిగే నైపుణ్యాలను ఎంచుకోండి (ఉదా: కంప్యూటర్ నైపుణ్యాలు, గ్రాఫిక్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, కుట్లు, చేతిపనులు).
  3. స్వయం ఉపాధి: మీ నైపుణ్యాలను ఉపయోగించి చిన్న వ్యాపారం ప్రారంభించడం గురించి ఆలోచించండి. ప్రభుత్వం నుండి రుణాలు, శిక్షణ లభించే అవకాశాలున్నాయి.
  4. రిమోట్ వర్క్ అవకాశాలు: ఇంటి నుండి పనిచేయడానికి వీలు కల్పించే ఉద్యోగాల కోసం వెతకండి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక అవకాశాలున్నాయి.
  5. ఆర్థిక ప్రణాళిక: మీ ఆదాయాన్ని ఎలా నిర్వహించాలి, ఎలా పొదుపు చేయాలి అనేదానిపై ఒక ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

ప్రశ్న: నాకు దివ్యాంగుడిగా ఉన్న హక్కులు సరిగా తెలియవు. నేను వివక్షకు గురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి?
జవాబు: దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం చట్టాలు ఉన్నాయి. మీ హక్కుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

  1. ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, 2016 (RPwD Act, 2016): ఈ చట్టం దివ్యాంగుల హక్కులను రక్షిస్తుంది. విద్య, ఉద్యోగం, అందుబాటు, సామాజిక భద్రత మొదలైన అంశాలపై దీనిలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. దివ్యాంగుల హక్కుల పూర్తి వివరణ కొరకు RPwD Act, 2016 పై క్లిక్ చేయండి.
  2. నోడల్ ఏజెన్సీలు: రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల సంక్షేమ శాఖలు (Department for Welfare of Persons with Disabilities) ఉంటాయి. మీకు ఏదైనా సమస్య ఎదురైతే వారిని సంప్రదించవచ్చు.
  3. న్యాయ సహాయం: వివక్షకు గురైనప్పుడు లేదా మీ హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు న్యాయవాదులు లేదా న్యాయ సహాయ కేంద్రాల ద్వారా సహాయం పొందవచ్చు.
  4. NGOలు మరియు స్వచ్ఛంద సంస్థలు: దివ్యాంగుల హక్కుల కోసం పనిచేసే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వారు మీకు అవగాహన కల్పించడంతో పాటు న్యాయ సహాయం కూడా అందిస్తారు.
  5. ఫిర్యాదు చేయండి: మీరు ఏదైనా వివక్షను ఎదుర్కొంటే, సంబంధిత అధికారులకు లేదా మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెనుకాడకండి.

ప్రశ్న: నా భవిష్యత్తు గురించి, ఆర్థిక భద్రత గురించి చాలా ఆందోళనగా ఉంది. నా వైకల్యం వల్ల నా లక్ష్యాలను చేరుకోలేనేమో అని భయంగా ఉంది. ఈ ఆందోళనను ఎలా తగ్గించుకోవాలి?
జవాబు: ప్రత్యేకించి సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన పడటం సహజమే కానీ ఈ ఆందోళన మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా చూసుకోవాలి.

  1. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోండి: ఒకేసారి పెద్ద లక్ష్యాలను కాకుండా, వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ప్రతి చిన్న విజయం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
  2. ప్రణాళిక వేసుకోండి: మీ కెరీర్, ఆర్థిక లక్ష్యాల కోసం ఒక ప్రణాళిక వేసుకోండి. ఏ నైపుణ్యాలు అవసరం, ఎక్కడ శిక్షణ పొందాలి, ఏ సహాయం తీసుకోవాలో తెలుసుకోండి.
  3. సాధ్యాసాధ్యాలను అంచనా వేయండి: వాస్తవానికి దూరంగా ఉండే అంచనాలు పెట్టుకోకుండా, మీ సామర్థ్యాలు మరియు అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోండి.
  4. ప్రభుత్వ సహాయం గురించి తెలుసుకోండి: దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయ పథకాలు, ఉపాధి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాల గురించి వివరాలు సేకరించండి.
  5. ప్రొఫెషనల్ సహాయం: భవిష్యత్తు ప్రణాళికపై నిపుణుల సలహా తీసుకోవడం, లేదా తీవ్రమైన ఆందోళన ఉంటే మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

ప్రశ్న: నన్ను సమాజం ఇంకా పూర్తిగా అంగీకరించడం లేదు. వివక్షకు గురైనప్పుడు చాలా కోపంగా, బాధగా ఉంటుంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?
జవాబు: వివక్ష అనేది చాలా బాధాకరమైన అనుభవం. దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం మరియు సరైన వ్యూహాలు అవసరం.

  1. మీ హక్కుల గురించి తెలుసుకోండి: దివ్యాంగులకు సమానత్వం, గౌరవం పొందే హక్కు ఉంది. మీ హక్కుల గురించి తెలుసుకోవడం మీకు శక్తినిస్తుంది.
  2. సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి: వివక్షకు గురైనప్పుడు, మీరు ఎలా స్పందించాలో ముందుగానే నిర్ణయించుకోండి. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం మంచిది, మరికొన్నిసార్లు ధైర్యంగా సమాధానం ఇవ్వడం అవసరం.
  3. బలమైన సహాయక బృందాన్ని (Support System) ఏర్పరుచుకోండి: మీ కుటుంబం, స్నేహితులు మరియు మిమ్మల్ని అర్థం చేసుకునే వారితో ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకోండి. వారు మీకు మానసిక మద్దతునిస్తారు.
  4. కేవలం అవగాహన లోపంగా చూడండి: కొన్నిసార్లు ప్రజలు తెలియక వివక్ష చూపిస్తారు. వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
  5. ఫిర్యాదు చేయడానికి వెనుకాడకండి: తీవ్రమైన వివక్ష ఎదురైతే, చట్టపరమైన సహాయం తీసుకోవడానికి లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడకండి. ఇది ఇతరులకు కూడా సహాయపడుతుంది.
మీ అనుభవాలను, సందేహాలను, సమస్యలను పంచుకోవడానికి adopttothrive@gmail.com కు మెయిల్ చేయండి.

9 కామెంట్‌లు:

  1. అజ్ఞాతజూన్ 08, 2025

    మొదటి ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం ఇంప్రెసివ్ మేడం

    రిప్లయితొలగించండి
  2. అజ్ఞాతజూన్ 08, 2025

    మీరూ చెప్పే ఈ ఆన్సర్ ఇంకెక్కడ దొరకవు ఎవరు ఇలా చెప్పలేరు మేడం. హ్యాట్సాఫ్ మేడం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీలిమజూన్ 09, 2025

      అవును అండి. మేడంలా ఎవరు చెప్పరు చెప్పలేరు. నేను చాలా మందికి నా సమస్యను చెప్పా కానీ ఎవరూ ఈ విధంగా రెస్పోండ్ అవ్వలేదు. we are lucky to have her

      తొలగించండి
  3. అజ్ఞాతజూన్ 08, 2025

    ఇంతకాలం ఇలాంటి ఆణిముత్యం ఎక్కడ దాగుంది? నువ్వు చేసే ఈ ప్రయత్నం దివ్యాంగులకు చాలా విలువైనదమ్మ. నేనొక రిటైర్డ్ ఉద్యోగిని. నీ వెబ్సైట్ చూసిన ప్రతిసారీ కాలం కొంచెం వెనక్కి వెళ్తే బాగున్ను అనిపిస్తుందిరా. తెలుగింట నీలాంటి ఆణిముత్యం దొరకడం ఈ తరం దివ్యాంగుల అదృష్టం. All the best for your bright future ma.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాతజూన్ 08, 2025

    మేడం వెబ్సైట్ లో మీ ఫోటో పెట్టండి మేడం. ఇంత మోటివేషన్ ఇస్తున్న మిమ్మల్ని చూడాలి.

    రిప్లయితొలగించండి