Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

పేద పిల్లల కోసం ఒక ఆశ: ఒక చిన్న ప్రయత్నం వెనుక ఉన్న గొప్ప ఆనందం

అందరికి నమస్కారం. ఈ సాయంకాల సమయములో మీ అందరితో ఒక చిన్న విషయాన్ని  పంచుకోవాలని కోరుతున్నాను. 
నేను 90% దివ్యాంగురాలిని. నా భవిష్యత్తు బాగుండాలనే తపనతో, నాలుగో తరగతిలో హైదరాబాద్‌లోని వేగేశ్న పద్మావతి ఫౌండేషన్ స్కూల్‌లో నా తల్లిదండ్రులు నన్ను చేర్చారు. శారీరక వైకల్యం ఉన్న పిల్లలకు విద్య, ఆరోగ్యం అందించే అద్భుతమైన సంస్థ అది. ఆ స్కూల్‌లో రెండు హాస్టల్స్ ఉండేవి: స్పెషల్ హాస్టల్ (రూ.20,000 ఫీజుతో), మరియు ఉచిత హాస్టల్. నా తల్లిదండ్రులు నన్ను స్పెషల్ హాస్టల్‌లో చేర్చినా, ఉచిత హాస్టల్‌లో ఉన్న అనాథ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలతో నాకు మంచి స్నేహం కుదిరింది. వారి కష్టాలను దగ్గరగా చూడటం వలన బాల్యం నుండే పేద పిల్లలకు ఏదైనా సహాయం చేయాలనే కోరిక నా మనసులో నాటుకుపోయింది.

ఒక సంవత్సరం తర్వాత, నేను హాస్టల్‌లో ఉండలేక ఇంటికి తిరిగి వచ్చేశాను. ఇంటికి వెళ్లే ముందు, అమ్మ నా కోసం పెట్టిన మంచి మంచి ఫ్రాక్స్, స్కర్టులతో నిండిన పెద్ద ట్రంక్ పెట్టెలోని బట్టలన్నీ ఉచిత హాస్టల్‌లోని నా స్నేహితురాళ్లకు ఇచ్చేశాను. అది నా మొదటి చిన్న సాయం. ఆ తర్వాత మళ్ళీ పేద పిల్లలకు సహాయం చేసే అవకాశం రాలేదు.

కానీ, నిన్న మా నాన్నగారి పుట్టినరోజు. ఆయనకు గుర్తుండిపోయే ఒక చిన్న జ్ఞాపకాన్ని బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. అప్పుడు నాకు నా సహోద్యోగి స్టేటస్‌లో చూసిన ఒక స్వచ్ఛంద సంస్థ గుర్తొచ్చింది. ఆ సంస్థ వెబ్‌సైట్ చూడగానే అది సామాజిక సేవకు అంకితమైన సంస్థ అని తెలిసింది. ఆ సంస్థ ద్వారా పేద పిల్లలకు ఒక్కపూట భోజనం పెడితే, వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వు మనసుకు ఎనలేని ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని నాకు అనిపించి నిన్నటి రోజున కొంత మంది పిల్లలకు డొనేట్ చేయటం జరిగింది. 

మేము దివ్యాంగులం ఇలాంటివి  మేము బయటకి వెళ్లి చేయాలి అంటే మాకు మరొకరి సహాయం అవసరం అని బాధపడుతున్నారా? మరి మీరు కూడా ఇలా డొనేట్ చేయాలనుకుంటున్నారా? అసలు బాధపడాల్సిన అవసరమే లేదండి. మీరు ఇంటి నుండి కేవలం ఆన్లైన్ ద్వారానే పేద పిల్లలకు సహాయం చెయ్యొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సంస్థను గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం పదండి. 


థాగామ్ ఫౌండేషన్ (Thaagam Foundation)

థాగామ్ ఫౌండేషన్ (Thaagam Foundation) అనేది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది నాన్-గవర్నమెంట్ సంస్థగా నమోదు చేయబడింది. ఇది 2018లో స్థాపించబడింది. తాగం ఫౌండేషన్ పేరులో ఉన్న "తాగం" అంటే ఆకలి.

వీరి ప్రధాన లక్ష్యాలు:

  • ఆకలిని నిర్మూలించడం: నిరుపేదలు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించడం.
  • విద్యకు మద్దతు: పేద పిల్లలకు విద్యను అందించడంలో సహాయం చేయడం.
  • ఆరోగ్య సంరక్షణ: వైద్య సహాయం అందించడం.
  • సామాజిక సంక్షేమం: దుప్పట్లు, చెప్పులు, కుట్టుమిషన్లు, వినికిడి పరికరాలు వంటి అవసరమైన వస్తువులను అందించడం.
  • పర్యావరణ పరిరక్షణ: చెట్లను నాటడం వంటి పర్యావరణ కార్యక్రమాలలో పాల్గొనడం.
  • జంతు సంరక్షణ: వీధి జంతువులకు, ముఖ్యంగా కుక్కలకు ఆహారం అందించి, వాటి సంక్షేమానికి కూడా పాటుపడతారు.

సంస్థ గురించి గమనించదగిన అంశాలు:

  • పారదర్శకత: తమ వెబ్‌సైట్‌లో 100% పారదర్శకతతో పనిచేస్తామని, ప్రతి విరాళం ఎలా ఉపయోగించబడుతుందో వీడియోల ద్వారా చూపిస్తామని పేర్కొన్నారు.
  • కార్యకలాపాలు: వీరు భారతదేశంలోనే కాకుండా శ్రీలంకలో కూడా సహాయకార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో ఆహార సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించారు.
  • రిజిస్ట్రేషన్: ఇది RoC-చెన్నై కింద నమోదు చేయబడిన ఒక ప్రైవేట్ కంపెనీ. దీని కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (CIN) U80220TN2018NPL124811.
  • కొన్ని భిన్నమైన అభిప్రాయాలు: కొన్ని ఆన్‌లైన్ చర్చలు మరియు సమీక్షలలో, కొంతమంది వినియోగదారులు వారి ప్రామాణికత గురించి అనుమానాలను వ్యక్తం చేశారు, అయితే మరికొందరు వారు నిజమైనవారని మరియు వారి కార్యాలయాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఎన్‌జిఓలకు లాభాలు లేకుండా పనిచేయడం కష్టం, మరియు వారు తమ సిబ్బంది జీతాలు మరియు ఇతర ఖర్చులకు కొంత భాగాన్ని ఉపయోగించడం సాధారణం.
మొత్తంమీద, థాగామ్ ఫౌండేషన్ సామాజిక సేవకు అంకితమైన సంస్థగా కనిపిస్తుంది. వారి పారదర్శకత విధానం (వారు సేకరించిన ప్రతి విరాళానికి సంబంధించిన వినియోగాన్ని ఫోటోలు మరియు వీడియోల ద్వారా దాతలకు అందిస్తారు. ఇది వారి విశ్వసనీయతను పెంచుతుంది.) ప్రశంసనీయం. అయితే, ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చే ముందు, స్వంత పరిశోధన చేయడం, వారి కార్యకలాపాలను, నివేదికలను పరిశీలించడం మరియు వీలైతే నేరుగా సంప్రదించడం మంచిది.

చిరునామా    : నెం.6, ధనమ్మాళ్ స్ట్రీట్, స్పర్టాంక్ రోడ్, చెట్‌పేట్ చెన్నై 600-031

వెబ్సైటు        :  www.thaagam.org

ఫోన్ నెంబర్ :  +91 78239 32053 ; +91 80691 69691 ; +91 97909 27575

ఈ -మెయిల్ :  office@thaagam.email



ఇదే మా నాన్నగారికి నేను ఇచ్చిన చిరు జ్ఞాపకం. కేవలం ఒక పూట భోజనంతో పేద పిల్లల జీవితాల్లో ఆనందం నింపడం, అది చూసి మనం పొందే సంతోషం ఎంత గొప్పదో మీరే చూడండి. మీరూ మీ స్థాయిలో ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేసి, సమాజానికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను.

ముఖ్య గమనిక; ఈ పోస్ట్ ఏ సంస్థను ప్రమోట్ చేయడం కోసం చేయలేదు కానీ కేవలం నా చిన్న అనుభవమును మీతో షేర్ చేయాలనుకొని ఇది మరెందరికో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చేయబడింది. 

3 కామెంట్‌లు: