అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ తన అంతర్గత శక్తిని ఎలా గుర్తించాలి మరియు ఎదుగుదల (Thrive) వైపు ఎలా అడుగులు వేయాలి అనే కోణంలో ఈ ఆర్టికల్ రూపంలో మరొకసారి మీ ముందుకు వచ్చాను.
ప్రతి ఏటా మనం 'మహిళా దినోత్సవం' జరుపుకుంటాం. శుభాకాంక్షలు చెప్పుకుంటాం, గౌరవించుకుంటాం. కానీ, అసలైన ఉత్సవం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒక మహిళ తనను తాను సంపూర్ణంగా ప్రేమించుకున్నప్పుడు, తన ఎదుగుదల కోసం దైవ బలంతో తను స్వయంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు!
ఈ ఏడాది మన 'Adopt to Thrive' వేదికగా, మనం కేవలం మనుగడ సాగించడం (Survive) గురించి కాకుండా, అభివృద్ధి చెందడం (Thrive) గురించి మాట్లాడుకుందాం.
మొదటిగా, నిత్యం పరుగుల ప్రపంచంలో, బాధ్యతల ఒత్తిడిలో మనల్ని మనం మర్చిపోవడం అలవాటైపోయింది; కానీ ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే దానికి నీరు, వెలుతురు ఎంత అవసరమో, ఒక మహిళా మనసు ప్రశాంతంగా ఉండటానికి 'Me Time' అంటే మీ కోసం కొంత సమయం కేటాయించడం కూడా అంతే అవసరం. రోజూ కనీసం కొద్దిసేపైనా మీకు నచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలు లేదా పుస్తకాలు చదువుతూనో, నచ్చిన సంగీతం వింటూనో లేదా ఒక కప్పు హెర్బల్ టీ తాగుతూ ప్రకృతిని గమనిస్తూనో గడపడం మీ అంతర్గత శక్తిని రీఛార్జ్ చేస్తుంది. మీ మదిలో కొత్త సృజనాత్మకతను కలిగిస్తుంది.
ఈ క్రమంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మన ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ప్రకృతి సిద్ధమైన ఆహారపు అలవాట్లను, క్రమశిక్షణతో కూడిన వ్యాయామాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకున్నప్పుడే మన కలలను నిజం చేసుకునే శారీరక శక్తి మనకు లభిస్తుంది. తద్వారా ఒక కొత్త ఉత్సాహాన్ని మనం రుచి చూడగలుగుతాము.
జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా, భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగే పట్టుదలే మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటూ, సమాజంలో మారుతున్న పోకడలను గమనిస్తూ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా పొందే ఆత్మవిశ్వాసం అమూల్యమైనది. మహిళా శక్తి అంటే కేవలం సహనం మాత్రమే కాదు, అంతులేని సంకల్పం కూడా!
అందుకే ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మనందరం ఒక ప్రమాణం చేద్దామా: "నన్ను నేను ప్రేమిస్తాను, నా ఎదుగుదలకు ప్రాధాన్యతనిస్తాను మరియు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకుంటూ సగర్వంగా అభివృద్ధి చెందుతాను." మనం చేసిన ఈ ప్రమాణంలో స్థిరంగా ఉండాలని ఆశిస్తున్నాను.
ప్రతి అడుగులోనూ ఒక సృజన, ప్రతి పోరాటంలోనూ ఒక గెలుపు... నా తోటి స్త్రీ మూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
" ప్రతీ రోజు మీ కోసం మీరు కేటాయించుకున్న ఆ ప్రత్యేక సమయం (Me Time) ఏది? మాతో కామెంట్స్‌లో పంచుకోండి!"

Happy Women's Day Madam 💐💐
రిప్లయితొలగించండిThank you
తొలగించండి